Skip to content

Uncategorized

వేసవిలో కూరగాయల సాగు – జాగ్రత్తలు – డా॥ కె.రాధారాణి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఉద్యాన కళాశాల, డా॥ వై.ఎస్‌.ఆర్‌. ఉద్యాన విశ్వవిద్యాలయం

Srikanth Adira July 17, 2020 2 min read

వేసవిలో కూరగాయల సాగు – జాగ్రత్తలు 

వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయలసాగుకు ప్రతిబంధక మవుతుంది. వీటిని అధిగమించి రైతులు వేసవిలో కూరగాయలను సాగుచేసి లాభాలు పొందాలంటే, వేసవికి అనువైన కూరగాయలను, వాటిలో అధిక వేడిని తట్టుకుని దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పులు వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి, పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల రైతు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్దతును చేపట్టి, ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సక్రమంగా వినియోగించుకుని కూరగాయలసాగుపై ప్రత్యేక శ్రద్దవహిస్తే అధికలాభాలు పొందుతారు.

వేసవిలో నారును నీడ క్రింద పెంచాలి. తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలి. నారుమళ్ళపై నైలాన్‌ వల్ల ఏర్పాటు చేసుకుంటే రసం పీల్చే పురుగులు, వైరస్‌ తెగుళ్ల సమస్యను అధిగమించవచ్చు. మళ్ళలో మొత్తం విత్తనాన్ని ఒకేసారి విత్తకుండా విడతలుగా విత్తుకోవటం మంచిది. దీని వల్ల ఒక సమయంలో పండిరచిన కూరగాయ పంట దెబ్బతిన్నా లేదా పంటదిగుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ ధర పలికితే, ఇంకో సమయంలో విత్తిన పంట నుండి మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది.

పొలంలో అముదం, మొక్కజొన్న లాంటి పంటను నీడనిచ్చే విధంగా ఉత్తర దక్షిణ దిశలో నాటుకోవాలి. లేదా రైతులు వీలైతే 35 శాతం షేడ్‌నెట్‌లను ఏర్పాటు చేసుకుంటే ఎండ తీవ్రతను తగ్గించి మంచి దిగుబడులు సాధించవచ్చు.

వేసవిలో మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కల సాంద్రత ఎక్కువ ఉండేటట్లు చూడాలి. 

ఉదా: వర్షాకాలంలో 60 x 45 సెం.మీ. దూరంలో టమాట నాటుకుంటే, వేసవిలో 45 x 30 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. 2.0 x 0.5 మీ. దూరంలో బీర విత్తుకోవాలి. వర్షాకాలం  పంటకు ఎకరాకు 4 కిలో బెండ విత్తనం వాడితే, వేసవి పంటకు 6 కిలో విత్తనం వాడాలి.

వేసవిలో కొత్తగా నాటిన మామిడి, జామ, కొబ్బరి లాంటి పండ్ల తోటల్లో మొదటి 3-4 సంవత్సరాల అంతరపంటలుగా బెండ, సొర, బీర, గుమ్మడి, దోస, ఫ్రెంచి చిక్కుడు, గోరుచిక్కుడు వంటి కూరగాయలపంటను సాగుచేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు.

నేలలోని తేమను సంరక్షించే చర్యులు చేపట్టాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు, వాటితోపాటు జీవన ఎరువులను వాడితే మంచి ఫలితం ఉంటుంది. సేంద్రియ ఎరువు ఎక్కువగా వాడటం వల్ల నేల గుల్లబారి, తేమను ఎక్కువ రోజులు పట్టివుంచి మొక్కకు అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది. పాదుల్లో, రెండు వరుసల మధ్య వరిగడ్డి, వరి ఊక, వేరుశనగ పొట్టు, ఎండుటాకులు లేదా పచ్చిరొట్ట ఎరువులను నేలపై పరిస్తే నేలలో తేమ సంరక్షించబడి మొక్కకు ఎక్కువ రోజులు అందుబాటులో ఉండటమేగాక కలుపు పెరుగుదలను అరికడుతుంది.

ఉన్న కొద్దిపాటి నీటిని బిందు (డ్రిప్‌) లేదా తుంపర్ల (స్ప్రింక్లర్‌) పద్ధతిలో ఇవ్వటం వల్ల కొద్ది నీటితో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయ పంటలను పండిరచవచ్చు. ఒక ఎకరాకు సరిపడా నీటితో డ్రిప్పు ద్వారా 2 1/2 ఎకరాలలో, తుంపర్ల పద్ధతిలో 1 1/2 – 2 ఎకరాలలో సాగుచేయవచ్చు. నీరు సక్రమంగా ఇవ్వటం వల్ల తుంపర్ల ద్వారా ఎండవేడి తగ్గి మంచి దిగుబడులు పొందవచ్చు. సాధారణ పద్ధతిలో నీరు ఇచ్చే పంటలలో ఎండ తీవ్రత తగ్గించటానికి అప్పుడప్పుడు సాయంత్రం వేళ నీటిని పిచికారీ చేయాలి. టమాటలోనూ, పుచ్చలోనూ నీటి యాజమాన్యం సరిగా లేకపోతే కాయపగుళ్ళు కనబడతాయి. కాయగూరలను, ఆకుకూరలను, చ్లటి పూట కోసి, తడిగోనె సంచి కప్పి మార్కెట్‌కి పంపాలి.

Questions and answers

Ask a question

Questions are checked by our team before they appear. Your email is not shown.