ప్రపంచం మీద డైబ్బై శాతం నీరే వుండి అందులో ఒక్క శాతం మాత్రమే మంచినీరుగా వుపయోగపడుతున్నపుడు దాన్ని ధ్వంసం చేసుకున్న జాతిని ఏమనాలి అసలు. మన కుంటలు, వాగులు, వంకలు, వర్రెలు, బావులు, చెరువులు, నదులు ఒక్కొక్కటిగా ఎట్లా ధ్వంసమైపోయాయి. జీవనదులు జీవం లేకుండా ఇసుక పర్రెలుగా ఎందుకు మిగిలిపోయాయి. వానాకాలంలో నీరు వరదలై పొంగుతుంటే కాపాడుకోవడానికి నగరంలో నిజాం కాలంలో హైదరాబాద్‌ నగరంలో 3000 పైగా వున్న చిన్న పెద్ద కుంటలు ఒక్కటి కూడా ఆచూకీ లేకుండా, అందులో అక్రమ నిర్మాణాలు ఎలా వెలిసాయి? పై నుంచి పడ్డ నీరు నిలిచ్చే చోటు దొరకక సముద్రం పాలవుతుంటే, వున్న కొద్ది భూగర్భ జలాలూ అడుగంటుతున్న దుస్థితి. 

మనం చేసిన పాప ఫలితమే కదా ఇదంతా… లేకపోతే ఏమిటి…?

ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 780 మిలియన్ల ప్రజలు స్వచ్ఛమైన నీటికోసం అల్లాడిపోతున్నారు. ఆఫ్రికాలో ఓ తెగ ప్రజలు మంచినీళ్లు దొరకక, వేకువజామునే కిలోమీటర్ల కొద్దీ నడిచి అడవుల్లో ఆకుల మీద కారుతున్న మంచు బిందువులను ఒక్కొక్కటిగా సేకరించి మంచినీరుగా వాడుకుంటారట. ఒకనాడు నదులు పొంగిన జీవగడ్డ భారతావని కూడా ఇవాళ మంచినీటి చుక్క కోసం విలవిలలాడిపోతోంది. అటు చూస్తే ఏళ్ల తరబడి నీటి జాడ కనబడక అనంతపురం జిల్లా ఎడారి దారి పట్టింది. చిత్తూరు జిల్లాలో శిలాజాల లోపలకి వెయ్యి అడుగుల లోతున బోర్లు వేస్తే తప్ప నీటి చుక్క దొరికే అవకాశం లేదు. కృష్ణానది మైళ్లకు మైళ్లు ప్రవహిస్తున్నా పాలమూరు జిల్లా గొంతు తడవడం లేదు. ఫ్లోరిన్‌ నీళ్లు నల్లగొండకు నిద్ర పట్టనీయడం లేదు. పుష్కలంగా నీటి వనరులన్న ప్రాంతాలు రసాయన ఎరువులు, పురుగు విషాలతో విషతుల్యమైపోయాయి. అసలు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నాలుగు వందల అడుగులకు మించి నీళ్లు రకరకాల రసాయనాలతో విషపూరితమైనవి కాబట్టి వాటిని మంచినీటిగా ఉపయోగించకూడదని చెప్పింది. మరోప్రక్క కలుషితమైన నీటి వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఆరువేల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే, మనం రెండు గుక్కల        నీళ్లు తాగి గ్లాసు కింద పెట్టే లోపు ఒక చిన్నారి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతోంది. 

అడవుల్ని కొట్టేసి, కొండల్ని పిండేసి, నదుల్ని ఎండేసి, గాలిని కాలుష్యంతో నింపేసి, తిండిని రసాయనాల్తో కలిపేసి, ఇంకా ఎన్ని దుర్మార్గాలు కళ్లముందే జరుగుతున్నా ఇప్పటి దాకా మౌనంగానే వున్నాం. ఆఖరికి తాగే నీళ్లలో కూడా ఇన్ని రసాయనాలు వున్నాయంటే చుక్క కూడా గొంతు దిగడం లేదు. అలాగని తాగకుండా వుండనూలేము, చిన్న చిన్న పిల్లలు తాగే పాలే కాదు, నీళ్లు కూడా విషమని తెలిసాక ఇక మాట్లాడకుండా ఎలా వుండగలం. 

ఇందుకు మనమేం చేద్దాం…

నీరు లేకపోతే మనకు వర్తమానమూ లేదు, భవిష్యత్‌ అంతకన్నా లేదన్న నిజాన్ని మనమంతా నిర్భయంగా అంగీకరించాలి. నీటిని వ్యాపార వస్తువుగా మార్చిన సమస్త పరిస్థితులను వ్యతిరేకించాలి. ప్రతి నీటి చుక్కను గుండెలకు హత్తుకుని పదిలంగా కాపాడుకోవాలి. వాననీటి సంరక్షణ చేపట్టకపోతే భూగర్భజలాలను పెంచుకోకపోతే మానవజాతి ఈ భూమి మీద నుంచి నిష్క్రమించే రోజు మరెంతో దూరంగా లేదని గ్రహించాలి.