ఏ రకం వరి పంటకైనా విత్తనం పునాది. విత్తనం పండిరచాలి. నూర్పిడి చేయాలి. సరిjైున పద్ధతిలో శ్రేణికరణ (ప్రాసెసింగ్) చేయాలి. తద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు.
మంచి నాణ్యమైన విత్తనం విత్తుకుంటే తక్కువ విత్తనం అవసరం అవుతుంది. త్వరగా మొలక వస్తుంది. అంతా ఒకే విధంగా వుంటుంది. తిరిగి నాటు అవసరం తగ్గుతుంది. త్వరగా ఏపుగా పెరగడం ద్వారా, తెగుళ్ళను, చీడను తట్టుకునే సామర్ధ్యం పెంపొందించుకొంటుంది. కలుపు మొక్కల శాతం తగ్గుతుంది. దిగుబడి 5-20 శాతం వరకు పెరుగుతుంది.
సుస్థిర వ్యవసాయ కేంద్రం, రైతులకు పైన తెలిపిన విధంగా నాణ్యమైన విత్తనం అందించుటకు విత్తనోత్పత్తి సహకార సంఘాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో 7 సహకార సంఘాలు, విత్తనోత్పత్తి దారుల కంపనీ (ప్రొడ్యూసర్ కంపనీ)లతో పని చేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో రెండు సహకార సంఘాలు వున్నాయి. అవి ఎనబావి సేంద్రియ రైతుల పరస్పర సహాయక సహకార సంఘం ములుగు వ్యవసాయదారుల పరస్పర సహయక సహకార సంఘం, మెదక్ జిల్లా. ఈ రెండు సంఘాలు ప్రభుత్వం నుండి వచ్చిన సబ్సిడీ సహాయంతో మొబైల్ మినీ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కొనుగోలు చేశాయి. వరిలో బి.పి.టి.`5204, యం.టి.యు-1010, తెల్లహంస, ఆర్.పి.బయో 226, ఐ.ఆర్`64, కావ్య మొదలగు రకాలను సాగు చేసి మార్కెట్ చేస్తున్నాయి.
సుస్థిర వ్యవసాయ కేంద్రం, సహకార సంఘాలకు (బ్రీడర్ సీడ్) మూల విత్తనం సమకూర్చడం, మార్కెటింగ్ లైసెన్స్ అందించడంలో సహయం చేస్తున్నది. విత్తనోత్పత్తిలో అవసరమైన సాంకేతిక పరమైన విషయాలను శిక్షణద్వారా అందిస్తూ పర్యవేక్షిస్తున్నది. సహకార సంఘాల నిర్వహణలో అవసరమైన నాయకత్వపు శిక్షణలు సహకార సంఘాల డైరెక్టర్లకు సమకూరుస్తున్నది.
విత్తన మార్కెటింగ్, ప్యాకింగ్ మొదలగు విషయాలలో సుస్థిర వ్యవసాయ కేంద్రం నిపుణులు, సహకార సంఘం కోసం పని చేస్తున్నారు.
ప్రస్తుత సంవత్సరం ఖరీఫ్ సీజన్‌కు గాను రెండు సహకార సంఘాల నుండి వచ్చిన విత్తనం 200 బ్యాగులు మార్కెట్ చేశారు. తద్వారా వచ్చిన అనుభవంతో వచ్చే సంవత్సరం 10000 బ్యాగుల (30కిలోల) విత్తనం ఉత్పత్తి చేసి మార్కెట్ చేయుటకుగాను ఈ సంఘాలు ప్రణాళిక సిద్దం చేసుకొన్నాయి.
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో వరి పంటలో బి.పి.టి-5204, హెచ్.యం.టి., యం.టి.యు.-1010, ఐ.ఆర్.-64, డబ్ల్యూ.సి.ఐ.-14, కావ్య, సురేఖ, తెల్ల హంస (రకాలను) సాగు చేస్తున్నారు. ఈ రకాలు వచ్చి రబీ మరియు ఖరీఫ్ సీజన్స్‌కు అందుబాటులో వుంటాయి.
- ఈ కార్యక్రమంలో భాగంగా పత్తి పంటలో రైతులకు 30 కిలోల నాన్ బీటీ సూరజ్ వెరైటీ ఇవ్వడం జరిగింది.
- ముఖ్యమైన పంటలు: పత్తి, సోయ, కందులు (అత్యధిక భాగం వర్షాధారం.)
- రైతులను వారు వేసే పంటల ఆధారంగా జాయింట్ లయబిలిటీ గ్రూపుల ఏర్పాటు.
- మొత్తం గ్రూపులు 11 వుంటే అందులో మొత్తం 165 మంది సభ్యులు వున్నారు.
- ఒక్కొక్క గ్రూపు నందు 15 మంది సభ్యులు వున్నారు.
- సుస్థిర వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడానికి తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలంలో 14 మంది రైతులను సుస్థిర వ్యవసాయం కేంద్రం ఆధ్వర్యంలో ఎంచుకోవడం జరిగింది.
- తలమడుగు మండలంలో ఎంచుకున్న గ్రామాలు అనగా ఉమ్రి, రaారి, కపూర్దేవి, మండగూడ, కొసాయి, చెర్లపల్లి, దహేగామ, ఈ గ్రామాలలో చేసిన బేస్ లైన్ సర్వే ఆధారంగా రైతులు చిన్న, సన్నకారు రైతులు.
ముఖ్య ఉద్యేశాలు:
- సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడం
- రైతులను సహకార సంఘంగా మార్చడం
- నాన్ బీటీ పత్తి విత్తనం గల ‘సూరజ్’ విత్తనాలను పండిరచడం.
- రైతులకు సేంద్రియ కషాయల గురించి తెలియజేయడం. సహజంగా దొరికే వృక్ష జాతులను వినియోగించుకుని వివిధ రకాల సస్యరక్షణ మందులను తయారు చేయడం.
ప్రపంచం మీద డైబ్బై శాతం నీరే వుండి అందులో ఒక్క శాతం మాత్రమే మంచినీరుగా వుపయోగపడుతున్నపుడు దాన్ని ధ్వంసం చేసుకున్న జాతిని ఏమనాలి అసలు. మన కుంటలు, వాగులు, వంకలు, వర్రెలు, బావులు, చెరువులు, నదులు ఒక్కొక్కటిగా ఎట్లా ధ్వంసమైపోయాయి. జీవనదులు జీవం లేకుండా ఇసుక పర్రెలుగా ఎందుకు మిగిలిపోయాయి. వానాకాలంలో నీరు వరదలై పొంగుతుంటే కాపాడుకోవడానికి నగరంలో నిజాం కాలంలో హైదరాబాద్ నగరంలో 3000 పైగా వున్న చిన్న పెద్ద కుంటలు ఒక్కటి కూడా ఆచూకీ లేకుండా, అందులో అక్రమ నిర్మాణాలు ఎలా వెలిసాయి? పై నుంచి పడ్డ నీరు నిలిచ్చే చోటు దొరకక సముద్రం పాలవుతుంటే, వున్న కొద్ది భూగర్భ జలాలూ అడుగంటుతున్న దుస్థితి.
మనం చేసిన పాప ఫలితమే కదా ఇదంతా… లేకపోతే ఏమిటి…?
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 780 మిలియన్ల ప్రజలు స్వచ్ఛమైన నీటికోసం అల్లాడిపోతున్నారు. ఆఫ్రికాలో ఓ తెగ ప్రజలు మంచినీళ్లు దొరకక, వేకువజామునే కిలోమీటర్ల కొద్దీ నడిచి అడవుల్లో ఆకుల మీద కారుతున్న మంచు బిందువులను ఒక్కొక్కటిగా సేకరించి మంచినీరుగా వాడుకుంటారట. ఒకనాడు నదులు పొంగిన జీవగడ్డ భారతావని కూడా ఇవాళ మంచినీటి చుక్క కోసం విలవిలలాడిపోతోంది. అటు చూస్తే ఏళ్ల తరబడి నీటి జాడ కనబడక అనంతపురం జిల్లా ఎడారి దారి పట్టింది. చిత్తూరు జిల్లాలో శిలాజాల లోపలకి వెయ్యి అడుగుల లోతున బోర్లు వేస్తే తప్ప నీటి చుక్క దొరికే అవకాశం లేదు. కృష్ణానది మైళ్లకు మైళ్లు ప్రవహిస్తున్నా పాలమూరు జిల్లా గొంతు తడవడం లేదు. ఫ్లోరిన్ నీళ్లు నల్లగొండకు నిద్ర పట్టనీయడం లేదు. పుష్కలంగా నీటి వనరులన్న ప్రాంతాలు రసాయన ఎరువులు, పురుగు విషాలతో విషతుల్యమైపోయాయి. అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాలుగు వందల అడుగులకు మించి నీళ్లు రకరకాల రసాయనాలతో విషపూరితమైనవి కాబట్టి వాటిని మంచినీటిగా ఉపయోగించకూడదని చెప్పింది. మరోప్రక్క కలుషితమైన నీటి వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఆరువేల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే, మనం రెండు గుక్కల నీళ్లు తాగి గ్లాసు కింద పెట్టే లోపు ఒక చిన్నారి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతోంది.
అడవుల్ని కొట్టేసి, కొండల్ని పిండేసి, నదుల్ని ఎండేసి, గాలిని కాలుష్యంతో నింపేసి, తిండిని రసాయనాల్తో కలిపేసి, ఇంకా ఎన్ని దుర్మార్గాలు కళ్లముందే జరుగుతున్నా ఇప్పటి దాకా మౌనంగానే వున్నాం. ఆఖరికి తాగే నీళ్లలో కూడా ఇన్ని రసాయనాలు వున్నాయంటే చుక్క కూడా గొంతు దిగడం లేదు. అలాగని తాగకుండా వుండనూలేము, చిన్న చిన్న పిల్లలు తాగే పాలే కాదు, నీళ్లు కూడా విషమని తెలిసాక ఇక మాట్లాడకుండా ఎలా వుండగలం.
ఇందుకు మనమేం చేద్దాం…
- నీరు లేనప్పుడు ఇబ్బందులు పడడం కంటే అందుబాటులో వున్న చుక్కనీటిని కూడా వృధా చేయకపోవడం అవసరం. నగరాల్లో, పల్లెల్లో ఎక్కడిక్కడ ఇంకుడు గుంతలు, కందకాలు, చెక్‌డ్యామ్‌లు, వాటర్షెడ్లు నిర్మించుకోవాలి.
- వాన నీటిని ఒడిసి పట్టుకునే చాలా వరకు మంచినీటి కొరతను అధిగమించవచ్చు. సముద్రతీర ప్రాంతం కావడంతో ప్రకాశం జిల్లాలలోని ఉప్పు నీళ్ళు ఎక్కువగా వుంటాయి కాబట్టి అక్కడ చాలా ప్రాంతాల్లో సంప్రదాయికంగా వాననీటిని ఒడిసిపట్టి సంవత్సరమంతా మంచినీటిగా ఉపయోగిస్తారు. ఎడారి రాష్ట్రం రాజాస్థాన్‌లోని గ్రామాల్లో తరతరాలుగా వాననీటిని మంచినీటిగా వాడుకునే సంప్రదాయం వుంది.
- అతి తక్కువ వర్షపాతం పడే అనంతపురం ప్రాంతంలో కూడా (400-500 మి.మీ. వర్షపాతం) 200 చదరపు అడుగుల వైశాల్యంలో వుండే ప్రభుత్వ కట్టిచ్చిన ఇందిరమ్మ ఇంటి మీద 10000 లీటర్లు నీరు నిల్వ చేసుకోవచ్చు.
- ఈ నీటిని రోజుకు 20 లీటర్ల చొప్పున వాడినా ఒక కుటుంబానికి దాదాపు 500 రోజులకు సరిపోతుంది.
- మహారాష్ట్ర రాలెగావ్ సిద్దిలో అన్నాహజారే, రాజస్థాన్‌లో రాజేంద్రసింగ్ చేసిన నీటి సంరక్షణ ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ కోవలో ఎండిపోయిన బావుల్ని, వట్టిపోయిన చెరువుల్ని, జీవం వచ్చిన నదుల్ని తిరిగి బతికించుకునే ప్రయత్నం చేయాలి.
- వనసంరక్షణే జన సంరక్షణగా భావించాలి. పిల్లలకు పర్యావరణ పరిరక్షణ, అడవుల ఉపయోగాలపై అవగాహన కల్పించి చిన్నప్పటి నుంచి ప్రకృతిని వాళ్ల జీవితంలో భాగం చేయాలి.
- అడవులు, నదులు, వానలు, రుతుపవనాలు, కాలాలు ఇలా ప్రకృతిలో ఒకదానికొకదానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని అవగాహన చేసుకుని మనం వివేకంతో వ్యవహరించాలి.
నీరు లేకపోతే మనకు వర్తమానమూ లేదు, భవిష్యత్ అంతకన్నా లేదన్న నిజాన్ని మనమంతా నిర్భయంగా అంగీకరించాలి. నీటిని వ్యాపార వస్తువుగా మార్చిన సమస్త పరిస్థితులను వ్యతిరేకించాలి. ప్రతి నీటి చుక్కను గుండెలకు హత్తుకుని పదిలంగా కాపాడుకోవాలి. వాననీటి సంరక్షణ చేపట్టకపోతే భూగర్భజలాలను పెంచుకోకపోతే మానవజాతి ఈ భూమి మీద నుంచి నిష్క్రమించే రోజు మరెంతో దూరంగా లేదని గ్రహించాలి.
పంటల సమగ్ర సస్యరక్షణలో వృక్షసంబంధ రసాయనాల ద్వారా, తక్కువ ఖర్చుతో, సహజ వనరులను వినియోగించి, వాతావరణ కాలుష్యం లేకుండా, చీడపీడలను అదుపుచేయవచ్చును. అందుబాటులో ఉన్న వివిధ ఆచరణ సాధ్యమైన ఎన్‌పిఎం పద్ధతులను ఉపయోగించి, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే సహజ సస్యరక్షణ పద్ధతులను అవలంభించి, అవసరమైనపుడు వివిధ సస్యరక్షణ కషాయాలనుపయోగించి ఇప్పటికే రైతులు అనేక పంటలలో సత్పలితాలు పొందుతున్నారు. ఆచరణ యోగ్యమైన ఎన్‌పిఎం పద్ధతులను ప్రతి యేటా ఉపయోగిస్తూ, క్రమేణా ‘‘కషాయాల’’ వినియోగాన్ని కూడా క్రమబద్ధం చేసిన ‘రైతు అనుభవాలు’ ఖమ్మం జిల్లా, పాల్వంచ మండలం, పునుకుల గ్రామంలో కానవస్తున్నాయి. వివిధ పంటలలో ఉపయోగించే సస్యరక్షణ కషాయాల తయారీ మరియు వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలను, సూచనలను ఈ క్రింది పేరాలలో వివరించటం జరిగింది.
1. పొగాకు కషాయం :
- పొగాకు కషాయం తయారు చేసేటప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి.
- పొగాకు కషాయం పిచికారి చేయునపుడు వంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి.
- పంట కాలంలో ఒకసారి మాత్రమే వాడాలి. లేని యెడల రైతుమిత్ర పురుగులు చనిపోయే ప్రమాదం వుంది.
- పొగాకులో ఘాటైన ‘నికోటిన్’ అనే మూలపదార్థం ఉండటం వలన పై జాగ్రత్తలు తీసుకోవాలి.
2. పచ్చిమిర్చి – వెల్లుల్లి ద్రావణం :
- ఈ ద్రావణం తయారు చేయునపుడు ఒంటికి నూనె రాసుకోవటం అవసరం.
- పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పంటలపై పిచికారి చేయునపుడు ఒంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి.
- పంట కాలంలో 1-2 సార్లు మాత్రమే ఈ ద్రావణాన్ని వాడాలి.
- తయారు చేసిన ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు.
3. పశువుల పేడ – మూత్రం ద్రావణం :
- మిశ్రమాన్ని ప్రతిరోజు కర్రతో బాగా కలియపెట్టాలి.
- తయారైన ద్రావణానికి 150 గ్రా॥ సున్నం కలపాలి.
- పచ్చిమిర్చి, వెల్లుల్లిలో ఘాటైన వంటికి, కంటికి మంటను కలుగజేసే మూలపదార్థాలు ఉండటం వలన పై జాగ్రత్తలు తీసుకోవాలి.
4. వావిలాకు కషాయం :
- వావిలాకు కషాయం తయారు చేసినపుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి.
- తయారు చేసిన ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు.
- వావిలాకులో ఆవిరి అయ్యే ఘాటైన తైలాలు వుండటం వలన పై జాగ్రత్తలు తీసుకోవాలి.
5. వేప కషాయం :
- వేప కషాయాన్ని తయారు చేసిన వెంటనే పంటపై పిచికారి చేసుకోవాలి. నిల్వ ఉంచరాదు.
- నీడలో బాగా ఎండిన వేప గింజలను మాత్రమే కషాయం తయారు చేయడానికి ఉపయోగించాలి.
- వేప కషాయం తయారీలో సబ్బుపొడికి బదులుగా కుంకుడుకాయలను లేదా శీకాయ పొడిని 500 గ్రాములు వాడాలి.
- వేపలో అజార్డిరిక్టిన్ అనే నీటిలో కరిగే మూలపదార్థం వుంటుంది.
6. వేప నూనె :
- వేపనూనె నీటిలో కరగదు. అందువల్ల 100 గ్రాముల సబ్బుపొడిని ఒక లీటరు నీటిలో ద్రావణంగా చేసి వేపనూనెలో కలపాలి.
- వేపనూనె లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున 100 లీటర్ల ద్రావణాన్ని తయారు చేసుకోవాలి.
- సస్యరక్షణ కషాయాల వల్ల లాభాలు :
- సహజ వనరులను ఉపయోగించుకొని రైతులు స్వయంగా తయారు చేసుకోవచ్చును.
- వాతావరణం కాలుష్యం అవ్వదు.
- ఖర్చు తక్కువ.
- పురుగులు తట్టుకొనే శక్తిని అభివృద్ధి చేయవు.
- మిత్రపురుగులకు ఎక్కువ హాని కలగదు.
- అన్ని రకాల పంటలలోనూ, నారుమడులలోను, పండ్ల వృక్షాలలోనూ పురుగుల నియంత్రణకు కషాయాలను వినియోగించవచ్చును.
- కషాయాలు మొక్కలలో రోగనిరోధక శక్తిని పెంచి, మొక్కలు ఆరోగ్యవంతంగా వుండటానికి దోహదపడతాయి.
ఉ॥ పశువుల పేడ-మూత్రం ద్రావణం
కావున రైతాంగం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ, సహజవనరులను వినియోగించుకొంటూ, తద్వారా దిగుబడులు తగ్గకుండా, నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.


