నారుమడి తయారీ

వరి విత్తడానికి ముందు నారుమడి స్థలాన్ని జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. విత్తనానికి తగిన పోషకాలు లభించే విధంగా నారుమడి నేలను సారవంతం చేయాలి. ఈ నేలలో పచ్చిరొట్ట ఎరువు వేసి దున్నాలి.

చేదు గుణాలున్న వేప తదితర ఆకులు పచ్చిరొట్టకు బాగా ఉపయోగ పడతాయి. వేప ఆకు నేలను సారవంతం చేయడమే గాక చీడ పురుగులను కూడా అదుపు చేస్తుంది. మొక్క వేరు నేలలోకి తేలికగా చొచ్చుకుని పోవడానికి పశువుల ఎరువు ఉపయోగ పడుతుంది. పూర్తిగా కుళ్ళిన ఎరువులో మొక్క పెరిగినప్పుడు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తరువాత కూడా మొత్తం పంట ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. నారుమడి చుట్టూ కాలువ తీయాలి. తడి మట్టి జారిపోకుండా అవసరమైతే నారుమడి చుట్టూ చెక్కలుగానీ, వాసం బద్దలు కానీ, వరి ఎంట్లు కానీ ఉంచాలి.

ప్రధానం పొలం తయారీ

విత్తనం వేయడానికి నారుమడిని సిద్ధం చేస్తు న్నప్పుడే, నారు నాటాల్సిన ప్రధాన పొలాన్ని తయారు చేయడం కూడా మొదలెట్టాలి. పొలాన్ని దున్నడం, చదును చేయడమే గాక, నేలను సారవంతం చేసే పనులు కూడా చేపట్టాలి. సేంద్రియ సేద్యం విధానంలో సులభంగా దొరికే దిబ్బ ఎరువు, వేపచెక్క వంటివి వేయాలి. వీటితో పాటు, అజోస్పైరిల్లమ్‌ వంటి జీవన ఎరువులు, అమృత జలం, జీవామృతం వంటి ద్రావణాలు ఉపయోగించి నేలలో సూక్ష్మజీవులను అభివృద్ధి చేసుకోవాలి.

వరి సాగు చేయడానికి ఎంచుకున్న భూమిని చదును చేసుకోవాలి. నీళ్ళు పెట్టినప్పుడు వరి మడి అంతా సమానంగా పారాలి. అదే విధంగా చేనులో ఎక్కువ నీరు ఉన్నప్పుడు వాటిని తీసేసే మార్గం అంటే మురుగు నీరు పోయే సౌకర్యం ఉండాలి. భూసారం పెంచడం కోసం సేంద్రియ పదార్థం వాడడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది మొక్కకు  కావాల్సిన పోషక పదార్థాలు అందుబాటులోకి తెస్తాయి.

భూసారాన్ని పెంచే కొన్ని సేంద్రియ పద్ధతులు

చెరువుమట్టి వేయడం :

ప్రతి మూడు సంవత్సరాలకోసారి ఎకరానికి    15-20 బండ్లు చెరువు మట్టిని తోలాలి. దీని వల్ల నేలకు తేమను పట్టిఉంచే శక్తి పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయి.

పెంటపోగు ఎరువు :

వరి సాగుకు పూర్తిగా కుళ్ళిన పెంటపోగు ఎరువు/ పశువుల పెండ తప్పనిసరిగా వేయాలి. ఎకరానికి కనీసం 15 బండ్లు లేదా 3 ట్రాక్టర్ల (6 టన్నులు) పశువుల ఎరువు సరిపోతుంది. ఎరువు బాగా నాణ్యమైనదిగా       ఉండాలి. ఈ క్రమంలో ఇటీవల వానపాముల (జెర్రలు) ఎరువు తయారీ, వినియోగం కూడా ఎక్కువవుతోంది.

పచ్చిరొట్టపైరు :

పచ్చిరొట్ట పైరు భూమి సారాన్ని పెంచడానికి ఎంతగానో సహాయ పడుతుంది. పచ్చిరొట్ట పైరు సగం పూత దశలో ఉండగా దున్ని, నేలలో కలిపి మురగ పెడతారు. సాధారణంగా జీలుగ, జనుము వంటి పంటలను పచ్చిరొట్ట పైరుగా  సాగు చేస్తారు. పచ్చిరొట్ట పైరు పెరగడానికి  45 రోజులు, అది మురగడానికి పది రోజులు పడుతుంది. పచ్చిరొట్ట పైరును దున్ని, నేలలో కలిపిన రోజు నారు మడి పోసుకుంటే పచ్చిరొట్ట పైరు కుళ్ళిపోయే సమయానికి నారుమడి నాటుకు తయార వుతుంది. పచ్చిరొట్ట పైరు సాగు చేయడానికి, మురగ బెట్టడానికి తగినంత నీటి వసతి, సమయం ఉండేట్లు చూసుకోవాలి. ఈ పద్ధతి చౌడు భూముల్లో వరి పండించి నప్పుడు మంచి ఫలితాన్నిస్తుంది.

పచ్చిఆకు ఎరువులు :

పచ్చిరొట్ట పంట వేసుకోవటం కుదరని పరిస్థితుల్లో దూరంగా ఉన్న చెట్ల ఆకులను, లేత కొమ్మలను తీసుకు వచ్చి పొలంలో కలుపుకోవచ్చు. ఇది పచ్చి ఆకుల ద్వారా నేలకు ఎరువులు అందించే పద్ధతి. పచ్చిఆకు ఎరువుగా ఉపయోగపడే మొక్కలు గ్లైరిసీడియా, కానుగ, మోతుక, సీతాఫలం, వెంపలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గట్ల మీద ఈ మొక్కలను నాటుకుంటే ప్రతీ పంట సీజన్‌లో ఎరువు అవసరాలు సులువుగా అందించవచ్చు.

పశు జీవాలు మంద కట్టడం :

ఇది సాంప్రదాయంగా పాటిస్తున్న పద్ధతే. పశువులు, గొర్రెలు, మేకలను మందులు, మందలుగా పొలాల్లో రాత్రిపూట విడిచిపెడతారు. వాటి మూత్రం, పేడ వల్ల నేల సారవంతమవుతుంది.

వేప చెక్క, గానుగ చెక్క

ఎరువువేసి, దున్ని, చదును చేయడంతో ఇక పొలం విత్తడానికి లేక నాట్లకు సంసిద్ధమవుతుంది. ఇందులో చివరి పనిగా నాట్లకు కొద్దిగా ముందు, దుక్కి ఎరువు, జీవన ఎరువులను కొద్దిగా ఉపయోగించవచ్చు. దిబ్బ ఎరువు, పచ్చిరొట్ట ఎరువుల మాదిరి కాకుండా వీటిని మొక్కలు తక్షణం తీసుకుంటాయి. నూనెగింజల  నుంచి నూనె తీసేశాక మిగిలే గానుగ చెక్కలో సేంద్రియ నత్రజని సమృద్ధిగా ఉంటుంది. గానుగ చెక్క ఒక ఎరువుగా చాలా వేగంగా పనిచేస్తుంది.

వరిసాగులో  చాలా ఎక్కువగా రెండు రకాల గానుగ చెక్కలను ఉపయోగిస్తారు. ఒకటి వేప చెక్క, రెండవది వేరుశెనగ చెక్క. ఈ రెండు గానుగ చెక్కలు  నేల ఉత్పాదక శక్తిని పెంచడమే గాక, చీడ పురుగులను దూరం ఉంచడానికి కూడా ఉపయోగపడుతాయి. నూనె గింజల నుంచి నూనె తీసేశాక మిగిలే గానుగ చెక్క వరి పెరుగుదల ప్రారంభ దశలో అత్యవసరమైన పోషకాల్ని అందిస్తుంది. పునాది ఎరువుగా ఉపయోగిస్తున్నట్లయితే ఎకరాకు 60 కిలోల వేప చెక్క లేదా 40 కిలోల వేరుశెనగ చెక్క సరిపోతాయి. పై పాటు ఎరువుగానయితే, రెండింటిలో ఏదైనా ఒకటి…. ఎకరానికి 25 కిలోలు సరిపోతుంది. ఎరువులు వేయాల్సిన పంట దశలలో ఈ గానుగ చెక్కను పొలంలో చల్లాలి. గానుగ చెక్కలోని పోషకాలు మొక్కలు ఉపయోగించుకోవడానికి తగిన రూపంలో సిద్ధంగా ఉంటాయి. మొక్కలు వాటిని వెంటనే తీసుకుంటాయి.

జీవన ఎరువులు

సేంద్రియ ఎరువులు వాడడం వల్ల తయారయ్యే సేంద్రియ పదార్థం భూమిలో సూక్ష్మ జీవుల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఈ సూక్ష్మ జీవులు నిరంతరం సేంద్రియ పదార్థాన్ని విడగొట్టి, అందులోని పోషకాన్ని మొక్కలు తీసుకోడానికి వీలుగా మార్చి అందిస్తుంటాయి. సేంద్రియ పదార్థంలో బందీ అయి ఉండే పోషకాలు,  విడుదలై మొక్కలకు అందాలంటే ఈ సూక్ష్మజీవులు తప్పనిసరిగా అవసరం.           నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను కృత్రిమంగా అభివృద్ధి చేయాలంటే అజోస్పైరిల్లమ్‌, ఫాస్పో బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ నాచువంటి సూక్ష్మజీవులను నేలలో చేర్చాల్సి ఉంటుంది. ఈ ఎరువులు అంగళ్ళలో దొరుకుతాయి. వీటిని తగిన మోతాదులలో పొలానికి చేర్చడం వల్ల నేలలో ఆయా సూక్ష్మ జీవుల సంఖ్యను పెంచగలుగుతాం.

వరిలో వివిధ సాగు పద్ధతులు

మనరాష్ట్రంలో వరి పంటను కాలువల కింద, చెరువుల కింద, బోరు బావుల కింద పండిస్తున్నారు.    1. నీటి సాగు పద్ధతి (పొలంలో నీరు నిల్వ ఉంచి పండించే పద్ధతి), 2. దమ్ములో విత్తు పద్ధతి, 3. మెట్ట సాగు పద్ధతి, 4. పరిమిత నీటి సాగు పద్ధతి, 5. శ్రీ పద్ధతి లాంటివి రైతులు అలనుసరిస్తున్నారు.

నీటి సాగు పద్ధతి

నీటి సాగు పద్ధతిలో నాలుగు నుంచి ఆరు ఆకులున్న నారును ఉపయోగించాలి. నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా ఉంటేనే మూన త్వరగా పెరుగుతుంది. ముదురు ఆకును నాటితే దిగుబడి తగ్గుతుంది.నాటుపైపైన నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశముంది. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్‌లో చ.మీ.కు 33 మూనలు, రబీలో 44 మూనలు ఉండేలా చూడాలి. నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ బాటలు తీయటం వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతిని కొంత వరకు అదుపుచేయవచ్చు.

దమ్ములో విత్తు పద్ధతి

దమ్ములో విత్తనం వెదజల్లడం గానీ వరసలలో విత్తడం గానీ చేస్తారు. దీనిని చల్లు పద్ధతి లేదా అలుకుడు పద్ధతి అని అంటారు. ఈ పద్ధతిలో నారుమడి తయారీ, నారు పోయడం, నారు తీయడం, నాట్లు లేకపోవడం వలన శ్రమ, కూలీల ఖర్చు తగ్గుతాయి. నాట్ల పద్ధతిలో కన్నా 10-15 రోజుల ముందుగానే పైరు కోతకు వస్తుంది. సాగు నీరు ఆదా అవడమే కాకుండా పైరు నీటి ఎద్దడికి బాగా తట్టుకుంటుంది.

నేరుగా దమ్ములో వెదజల్లి పండించటానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతులు

వివిధ ప్రాంతాల్లో నాటటానికి అనువైన పరి వంగడాలే చాలా వరకు నేరుగా వెదజల్లి పండించటానికి కూడా అనుకూలం. కాండం గట్టిగా ఉండి, పడిపోని రకాలను ఎంపిక చేసుకోవాలి. పొలంలో మురుగునీరు పోవడానికి బోదెలు ఏర్పాటు చేసుకోవాలి. పొలాన్ని 15 రోజుల ముందుగా దమ్ముచేసి తరువాత విత్తడానికి 4 రోజుల ముందు మరొకసారి దమ్ముచేసి సమానంగా చదువుచేసి, మట్టి పేరుకున్న తర్వాత ప్రతి 2 మీ.లకు 20 సెం.మీ. కాలువలు చేయాలి. మొలకెత్తిన విత్తనాన్ని (ముక్కు బయటకు రాగానే), పొలంలో పలుచటి నీటి పొర ఉంచి సమానంగా వెదజల్లాలి లేదా 8 సాళ్ళ పరికరంతో నీరు పూర్తిగా తీసివేసి కూడా విత్తవచ్చు. మొక్కల మొదటి ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు (సుమారు 7-10 రోజుల వరకు) పంటకు ఆరుతడులు అవసరం.

మెట్ట సాగు పద్ధతి

ప్రతి జిల్లాలోనూ వరి పంటను కొద్దోగొప్పో వర్షాధారంతో పండిస్తారు. సాధారణంగా భూసారం తక్కువ, తేలిక నేలల్లో మెట్ట సాగు చేస్తున్నారు. జూన్‌, జులై నెలల్లో వర్షాలు పడిన వెంటనే నేలను లోతుగా దున్ని  బాగా చివికిన పశువుల ఎరువు లేదా కంపోస్టును దుక్కిలో వేయాలి. అఖరిసారిగా దున్ని నేలను సమతలం చేయాలి. మెట్ట సాగులో ఎకరానికి గొర్రుతో విత్తడానికి 35 కిలోలు, వెదజల్లడానికి 40 కిలోల విత్తనం కావాలి. వర్షపు నీరు వీలైనంత ఎక్కువగా నేలలో ఇంకేటట్టు 15 రోజులకొకసారి వరుసల మధ్య అంతరకృషి చేయాలి. కలుపు మొక్కలు ఎక్కువగా రావడం వల్ల దిగుబడి తగ్గిపోకుండా ఉండటానికి సరైన సమయంలో  కలుపు యాజమాన్యం చేయాలి. మెట్ట వరి సాగులో స్వల్పకాలిక వంగడాలు వేస్తాం కాబట్టి అవి వర్షాకాలంలోనే కోతకు వస్తాయి.

పరిమితమైన నీటి సాగు పద్ధతి

మొదట మెట్ట సాగు, చెరువుకు నీరు వచ్చిన తర్వాత నీటి సాగుగా వరి పండించే పద్ధతిని పరిమిత నీటి సాగు లేదా మెట్ట-నీటి సాగు అనవచ్చు. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఈశాన్య రుతుపవన ప్రభావం వలన అధిక వర్షం కురిసే ప్రాంతంలో ఈ పద్ధతి అమలులో ఉంది. ఈ రకమైన సాగులో విత్తనాన్ని గొర్రుతో విత్తుతారు. విత్తేటప్పుడు నేల పై పొర 8-10 సెం.మీ. లోతు వరకూ తేమ ఉండేటట్లు చూసుకోవాలి. లేనిచో విత్తనం మొలకెత్తక ఖాళీలు వస్తాయి. వరి విత్తనాలకంటే ముందుగా కలుపు విత్తనాలు వస్తాయి కాబట్టి  విత్తన 15 రోజుల నుంచి 15 రోజులకు ఒకసారి వరుసల మధ్య దంతి తోలాలి. వరుసలలో మొక్కల మధ్య కలుపు మొక్కలను తీసివేయాలి.

వరిలో శ్రీ పద్ధతి

‘శ్రీ’ అనేది వరిలో ఒక రకం విత్తనం/ వంగడం కాదు. ఇదొక సాగు పద్ధతి మాత్రమే. ‘శ్రీ’ పద్ధతిలో ఏ వరి రకాన్నైనా సాగు చేయవచ్చు.